అమెరికాలో సైంటిస్టుల మిస్టరీ మరణాలు.. కుట్రా? యాదృచ్ఛికమా?

  • 2023 నుంచి 10 మంది శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు
  • మృతుల్లో ఎక్కువ మంది అణు, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నవారే
  • దీని వెనుక కుట్ర కోణం ఉందేమోనని దర్యాప్తు చేస్తున్నామన్న ట్రంప్
  • ప్రభుత్వ ప్రకటనతో ఈ మిస్టరీపై పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం లేదా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 2023 నుంచి ఇప్పటివరకు సుమారు 10 మంది శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో మరణించడం లేదా కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనలపై స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ‘ఇది యాదృచ్ఛికమా? లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనేది త్వరలో తేలుస్తాం’ అని ప్రకటించడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరణించిన లేదా అదృశ్యమైన వారిలో చాలామంది అణుశక్తి, గ్రహాంతరవాసుల నౌకలపై పరిశోధనలు చేస్తున్నవారే కావడం గమనార్హం. ముఖ్యంగా న్యూ మెక్సికో రాష్ట్రం నుంచే నలుగురు శాస్త్రవేత్తలు ఈ జాబితాలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పెంటగాన్‌లో అంతరిక్ష పరిశోధనలు చేసిన మేజర్ జనరల్ విలియం నీల్ మెక్‌కాస్లాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. గతేడాది జూన్‌లో జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మోనికా రెజా హైకింగ్‌కు వెళ్లి స్నేహితురాలికి కొన్ని అడుగుల దూరంలోనే మాయమయ్యారు. అలాగే, ఎంఐటీ ప్రొఫెసర్ నునో లౌరిరో, ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ గ్రిల్మైర్‌లను దుండగులు కాల్చి చంపారు.

ఈ వరుస ఘటనల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, గ్రహాంతరవాసులు లేదా అణుశక్తికి సంబంధించిన రహస్యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే ఈ హత్యలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, హార్వర్డ్ ప్రొఫెసర్ అవి లోబ్ వంటి నిపుణులు దీన్ని భిన్నంగా చూస్తున్నారు. ఇవి వేర్వేరు ఘటనలని, శాస్త్రవేత్తలపై ఉండే తీవ్రమైన పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు కూడా అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనప్పటికీ, ఈ వరుస ఘటనలపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించింది. నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని శ్వేతసౌధం ప్రకటించడంతో ఈ మిస్టరీ వీడుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

Scientist Deaths
US Scientists
Donald Trump
Nuclear Energy
Extraterrestrial Research
New Mexico
William Neel McCasland
Monica Reza
Nuno Loureiro
Carl Grillmair

More Telugu News